![]() |
| హోళి గురించి ... |
రంగుల జల్లులు రంగేళి హోళి!హోళి అన్నపదం వినబడగానే అందరిలో ఒక్కసారే ఉత్సాహం పెళ్ళుబుకుతుంది.పిల్లలు పెద్దలు అందరూ పిల్లలైపోయి, ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోవడం వద్దన్నవారిని వెంబడించిమరీ రంగులలో ముంచడం, ఇళ్ళలో దాక్కొన్నవారిని వెతకి పట్టుకొని బయటకులాగి రంగులలో ముంచడం ఇలా ఆడిన ఆనందకరమైన అల్లరి పనులు గుర్తుకు వస్తాయి. హోళి రోజు రంగులతో ఆడటం ఒక ఎత్తయితే, ఒంటి కి అంటిన రంగులను కడిగేసుకోవడం మరో ఎత్తు. మరుసటి రోజు సరిగా పోని రంగులు హోళి రోజున సంబరాలకు తీపి గుర్తులుగా మిగిలి పోతాయి. రంగులతో ఆడటం, స్వీట్లు తినడమే హోళికాదు. కేవలం మనదేశములోనే కాదు నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, సూరినామ్. గయానా, దక్షిణాఫ్రికా, ట్రినిడాట్, ఇంగ్లాండ్, అమెరికా మారిషస్, ఫిజి వంటి పలు దేశాలు ఆనందముగా హోళి పండుగ జరుపుకోవడం వెనుక అత్యంత ప్రాచీన సాంప్రదాయం ఉంది. తరచి చూస్తే హోళి పండుగ వెనుక అర్థం ఉంది. పరమార్థం వుంది. రంగుల జల్లులు రంగేళి హోళి!అతి ప్రాచీన హోళి'హోళిక'గా ప్రాచీనకాలం నుంచి హోళీ సంబరాలు జరుపుకొనే వారు. జైమిని రచించ్గిన ' పూర్వమీమాంస సూత్రాలు - కథక - గృహ్యసూత్రాలు' లో హోళి పండుగ జరుపుకొనే పధ్ధతి విపులంగా వున్నది. ఆర్యులు ఈ పండుగని అనాదికాలం నుండి జరుపుకొనే వారని చరిత్రకారులు భావిస్తున్నారు. క్రీ.పూ నుంచి జరుపుకొనే ఈ పండుగను ఆరంభంలో భర్త ఆరోగ్యం కోసము పూర్ణచంద్రుడిని పూజించడం వుండేది. కాల క్రమేణా 'హోళి' పండుగ స్వరూపం మారింది. నారద పురాణం, భవిష్య పురాణములలో హోళి పండుగ సంబరాల ప్రసక్తి కనిపిస్తుంది. క్రీ.పూ 300 సంవత్సరములకు చెందిన శిలాసనంలో 'హోళికోత్సవమ్' ప్రసక్తి వినిపిస్తుంది. క్రీ.శ 7వ శతాబ్ధానికి చెందిన శ్రీహర్షుడి రచన 'రత్నావళి' లో హోళి మహోత్సవం వర్ణన ఉంది. మందిరాల గోడలపై హోళి సంబరాల శిల్పాలున్నాయి. హంపి దేవాలయ నిర్మాణములో రాజు, ప్రజలు హోళి సంబరాలలో మునిగి తేలుతున్న చిత్రాలు ఉన్నాయి. అహ్మద్ నగర్ కు చెందిన 16వ శతాబ్దమునకు చిత్రలేఖనంలో వసంతరాగిణి చిత్రాలున్నాయి. మేవార్ కు చెందిన ఒక చిత్ర పటంలో మహారాణి హోళి ఆడటం ఉంది. ఇలా అతిప్రాచీన కాలం నుండి జరుపుకొనే హోళి పండుగకు సంబంధించి అనేక పురాణ గాథలు ఆధారంగా కనిపిస్తాయి. పురాణాల 'హోళి''హోళి' అనగానే శ్రీకృష్ణుడు, గోపికల కేళీ-వినోదాలు గుర్తుకు వస్తాయి పిచికారీ(ల)తో రంగులు చల్లుకుంటూ యువతీ-యువకులు శ్రీకృష్ణుడిని కేంద్రంగా జరిపే నృత్యవిన్యాసాలు గుర్తుకు వస్తాయి. బెంగాల్, ఒరిస్సాలలో జరిపే 'హోళి'ని శ్రీ చైతన్య మహాప్రభు జన్మదిన సంబరాలుగా జరుపుకుంటారు. రాధాకృష్ణుల ప్రేమతత్వాన్ని ప్రవచించిన తాత్వికుడు శ్రీచైతన్య మహాప్రభు. మహాపురాణ కథప్రకారం మహాశివుడి మూడవకన్ను నుండి వెలువడిన క్రోధాగ్నిలో భస్మమయి అశరీరంగా మిగిలిన కామదహన సందర్భముగా హోళి పండుగను జరుపుకుంటారు. మరో పురాణకథ ప్రకారం 'పూతన' మరణం సందర్భముగా వెల్లి విరిసిన ఆనందాలు 'హోళి' రూపు ధరించాయి. శ్రీకృష్ణుడిని చంపాలని వచ్చి పూతన బాలకృష్ణుని చేతిలో మరణించడం ఈ ఆనందొత్సవాలకు ప్రాతిపదిక. మరో ప్రధాన పురాణకథ ప్రహ్లాదుడికి సంబంధించినది. ప్రహ్లాదుడు విష్ణుభక్తి నుండి మళ్ళించడంలో విఫలమైన హిరణ్యకశిపుడు ఎలాగైనా ప్రహ్లాదుని అంతం చేయాలని పంతం పడతాడు. ప్రహ్లాదునితోబాటు నిప్పుల్లో దూకమని 'హోళిక'ను కోరతాడు హోళికకు నిప్పులు కాల్చలేని వరం వుంటుంది. అయితే ఈ వరం ఆమె ఒంటరిగా నిప్పుల్లో ప్రవేశిస్తేనే వర్తిస్తుంది. అది మరచి ప్రహ్లాదునితో పాటు నిప్పుల్లో దూకుతుంది, నిప్పుల్లో కాలిపోతుంది. విష్ణుభక్తి ప్రహ్లాదునిని కాపాడుతుంది. ఈ సందర్భముగా హోళి పండుగను హోళికను దహనం చేసి, రంగులతో ఆనందముగా జరుపుకుంటారు. ఎప్పుడు'హోళి'?పురాణ కథలతో పాటుగా హోళి పండుగ వెనుక మరో పరమార్థం ఉంది. హోళి పండుగను వసంత ఋతువు ఆగమనంగా పౌర్ణమి రోజున జరుపుకుంటారు.ఇది చలి కాలం తొలగి పోయి ఎండాకాలం ఆరంభానికి నాంది ప్రస్థావన వంటిది. హోళి పండుగను సాధారణంగా ' ఫాల్గుణి పూర్ణిమ' నాడు జరుపుకుంటారు. ఇలా ఓక ఋతువు వెళ్ళి మరో ఋతువు వచ్చే సమయంలో ముఖ్యముగా శీతాకాలం 'చలి' పోయి ఎండాకాలం 'వేడి' వచ్చే సమయంలో ఉష్ణోగ్రతల తేడావల్ల చర్మం చిట్లుతుంది. రంగులు ఆ చిట్లటం వల్ల కలిగే చికాకును తగ్గిస్తాయి. హోళీ రంగులు - జాగ్రత్త!!హోళీ రంగులకు ఒక ప్రత్యేకత ఉంది. చలికాలం వెళ్లి వసంత ఋతువు మొదలయినప్పుడు జలుబు జ్వరం రావడం జరుగుతుంది. వీటికి విరుగుడు గా పనిచేసే వేప, కుంకుమ, పసుపు, బిల్వ మరియు ఇతర ఆయుర్వేదీయ మొక్కల నుండి ఒకప్పుడు హోళీ రంగులను తయారుచేసేవారు. బాదం, పిస్తా, గులాబి రేకులతో “థండై” అనే పానీయం చేసి తాగుతారు, దీంట్లో భాంగ్ కలపడం కొన్ని చోట్ల ఆనవాయితీ కూడా. పలాష్ పువ్వులను ఉడకపెట్టి, రాత్రంతా నానబెట్టి, మర్నాడు పసుపు రంగు తయారు చేస్తారు. ఇది పక్క రంగు. ఈ పలాష్ పువ్వులకు ఔషధీ గుణాలు ఉన్నాయి. కానీ రాను రాను, వ్యాపార ధోరణి పెరిగి, కృత్రిమ రంగుల అమ్మకం పెరగడం వలన, ఈ సహజమైన రంగుల తయారి ఆగిపోయింది. ఈ కృత్రిమ రంగులు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని ఎన్నో చోట్ల పరిశోధనల వాళ్ళ తేలినా పెద్దగ వీటిని ప్రజలు గుర్తించలేదనేచెప్పవచ్చు.
చివరిగా.......హోళీ పండుగ ప్రాచీనమైనదైనా తెలుగు నాట ఒకప్పుడు అంతగా ముఖ్యమైనది కాకపోయినా, నేడు యువతీ యువకులలోనే కాక, పెద్దవారు, పిల్లలూ సరదాగా పాలుపంచుకోవడం వాళ్ళ, పట్టణాలలో విశేషంగానే జరుపుకుంటున్నారు. |